Mamata Banerjee: మమత భవిష్యత్తును నిర్ణయించే.. నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ నేడే!
- పశ్చిమబెంగాల్ లో నేడు రెండో విడత పోలింగ్
- నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు అధికారి
- నందిగ్రామ్ లో 22 కంపెనీల కేంద్ర బలగాలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. మమత తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేక బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురుతుందా? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు హైటెన్షన్ పుట్టిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది.
టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారి నియోజకవర్గం ఇది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తనను సవాల్ చేసి వెళ్లిపోయిన సువేందును మట్టికరిపించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారు. మరోవైపు తాను పెద్ద మెజార్టీతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండో విడతలో భాగంగా నందిగ్రామ్ తో పాటు మరో 29 నియోజక వర్గాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈ 30 స్థానాల్లో 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 75 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందిగ్రామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏకంగా 22 కంపెనీల పారామిలిటరీ ట్రూపులను మోహరించారు.