BSE: భారత స్టాక్ మార్కెట్ పై నాస్ డాక్ లాభాల ప్రభావం!
- యూఎస్ లో భారీ ఉద్దీపన ప్రణాళిక
- ఆ ప్రభావంతో ఆసియా మార్కెట్ల లాభాలు
- 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
యూఎస్ ప్రభుత్వం ప్రకటించిన భారీ ఉద్దీపన ప్రణాళికతో టెక్నాలజీ, హెల్త్ కేర్ కంపెనీలు లాభాల్లో పయనించగా, బుధవారం నాటి నాస్ డాక్ మంచి లాభాలను నమోదు చేసింది. దీని ప్రభావం గురువారం నాటి ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లపై పడింది. దీంతో ఈ ఉదయం సెషన్ ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు దాదాపు ఒక శాతం పెరిగాయి.
ఈ ఉదయం 10 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 300 పాయింట్ల వృద్ధితో 49,804 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 14,767 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఓ దశలో సెన్సెక్స్ 496, నిఫ్టీ 115 పాయింట్లు పెరగడం గమనార్హం.
సెన్సెక్స్ - 30లో నెస్టిల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, హిందుస్థాన్ యూనీలీవర్ సంస్థలు 0.3 నుంచి 0.6 శాతం నష్టాల్లో నడుస్తుండగా, మిగతా కంపెనీలన్నీ రెండున్నర శాతం వరకూ లాభాల్లో ఉన్నాయి.
ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.68 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.28 శాతం, హాంగ్ సెంగ్ 1.13 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.70 శాతం, కోస్పీ 0.74 శాతం, సెట్ కాంపోజిట్ 0.41 శాతం, షాంగై కాంపోజిట్ 0.25 శాతం లాభాలను నమోదు చేశాయి.