Corona Virus: రానున్న నెలన్నర భారతజాతి ఆరోగ్యానికి అత్యంత కీలకం!

Next 45 Days is Crucial for Indians Health

  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • టీకా పంపిణీ వేగవంతం చేయాలి
  • అన్ని చర్యలూ తీసుకుంటే మే నాటికి నియంత్రణ

ఇండియాలో కరోనా మహమ్మారి రెండో వేవ్ ఇంత బలంగా ఉంటుందని ఎవరూ ఊహించివుండరు. గత సంవత్సరం సెప్టెంబర్ లో రోజుకు దాదాపు 98 వేల కేసుల నుంచి ఫిబ్రవరి వచ్చే సరికి 10 వేలకు తగ్గిపోయిన కేసులు, ఇప్పుడు మళ్లీ 70 వేలను దాటేశాయి. కరోనాను ఇండియాలో విజయవంతంగా కట్టడి చేశామని భావించిన వారంతా ఇప్పుడు రెండో దశలో కేసుల సంఖ్య పెరుగుతుండటాన్ని చూసి అవాక్కవుతున్నారు.

రెండో దశ కరోనా కేసులు మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అధికంగా వస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. యూపీలో ఇంవరకూ 6.15 లక్షలకు పైగా కేసులు రాగా, బీహార్ లో 2.65 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. మొత్తం ఇండియాలో వచ్చిన కేసుల్లో యూపీ వాటా 5 శాతంగా, బీహార్ వాటా 2.18 శాతంగా ఉందంటే, ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసులతో ఇండియా‌ సెకండ్ ‌వేవ్‌ లోకి వెళుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక తొలిదశతో పోలిస్తే, రెండో దశ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర ఇప్పటికే కరోనా రెండో దశలోకి ప్రవేశించింది. ఇండియాలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 65 శాతం మహారాష్ట్రలోనే వస్తున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 72 వేలకు పైగా కేసులు రాగా, మహారాష్ట్రలో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇండియాలో కరోనా తొలిదశను ఎదుర్కోవడానికి పెట్టిన లాక్ డౌన్ కొంత ఉపశమనాన్ని కలిగించినా, ఎన్నో కోట్ల మందికి ఉపాధిని దూరం చేసి నష్టాన్ని మిగిల్చింది. ఆ సమయంలో సరైన వైద్య చికిత్సలు అందుబాటులో లేవనే చెప్పాలి. ఆ కారణంగా కూడా మరణాల సంఖ్య పెరిగింది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. సరైన చికిత్స లభిస్తోంది. టీకా కూడా అందుబాటులో ఉంది. అందువల్లే మరో లాక్ డౌన్ ను విధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు.

ఇక రానున్న 45 రోజులు అత్యంత కీలకమని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే సత్ఫలితాలను కళ్లజూడవచ్చని అంటున్నారు. ఈ నెలన్నర రోజుల్లో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేస్తే సెకండ్ వేవ్ కేసులను మే నెలలో నియంత్రణలోకి తేవచ్చని, సులువుగా తీసుకుంటే మాత్రం మరిన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టి వేయబడతామని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News