Rajinikanth: రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై కమల్ స్పందన
- ఈ అవార్డుకు రజనీ 100 శాతం అర్హుడన్న కమల్
- నా మిత్రుడికి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
- 16 చిత్రాల్లో కలిసి నటించిన రజనీ, కమల్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఒకరైన రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మరోవైపు తన స్నేహితుడు రజనీకి ఈ పురస్కారం రావడంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ స్పందించారు.
'నా ప్రియ మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ అవార్డుకు 100 శాతం అర్హుడు. ఈ పురస్కారం ఆయనకు దక్కడం సంతోషంగా ఉంది' అని కమల్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి 16 సినిమాలలో నటించడం గమనార్హం. చివరిసారిగా 1985లో బాలీవుడ్ మూవీ 'గిరఫ్తార్'లో వీరు నటించారు. ఇద్దరూ కలిసి మరోసారి నటించబోతున్నారనే వార్తలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ... ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరోవైపు రజనీని ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో మోహన్ లాల్, ఆశా భోస్లే, శంకర్ మహదేవన్, బిశ్వజీత్, సుభాశ్ ఘాయ్ ఉన్నారు.