Vijayashanti: నాంపల్లి కోర్టుకు హాజరైన విజయశాంతి.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వ్యాఖ్య
- ఉద్యమకారులను కేసీఆర్ అణచివేయాలనుకుంటున్నారు
- అక్రమ కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
- 2012 నాటి టీఆర్ఎస్ సభ విషయంలో నాకు నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు ఆమె ఓ కేసులో హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడేది లేదని వ్యాఖ్యానించారు. తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
ఉద్యమకారులను సీఎం కేసీఆర్ అణచివేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్రమ కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 2012లో మహబూబ్ నగర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని తనకు ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు వచ్చాయని, అందుకే కోర్టుకు హాజరయ్యానని చెప్పారు.
సభ జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత కేసు పెట్టడం ఏమిటనీ, అలా పెట్టడంలోనే సీఎం భయం ఏమిటో అర్థమవుతోందని ఆమె అన్నారు. ఒకవేళ కేసు పెట్టినా కేసీఆర్ పైనే పెట్టాలని, ఎందుకంటే.. అప్పుడు ఆ సభను నిర్వహించింది పార్టీ అధ్యక్షుడైన ఆయనేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. అయితే, కోర్టుల పట్ల తనకు విశ్వాసం ఉందనీ, అక్కడే పోరాడతానని ఆమె చెప్పారు. అప్పట్లో విజయశాంతి టీఆర్ఎస్‌లో కొనసాగిన విషయం తెలిసిందే.