System Update: ఈ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయొద్దు... సైబర్ నిపుణుల హెచ్చరిక

Cyber experts warns beware of system update app
  • కలకలం రేపుతున్న సిస్టమ్ అప్ డేట్ యాప్
  • ఒక్కసారి ఇన్ స్టాల్ చేస్తే  డేటా గల్లంతే!
  • ఫోన్ నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి!
  • ఈ మాల్వేర్ ను ట్రోజన్ కేటగిరీలో చేర్చిన జింపీరియం సంస్థ
సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో సిస్టమ్ అప్ డేట్ అనే ఫీచర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కు సంబంధించిన అప్ డేట్స్ వచ్చినప్పుడు యూజర్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే హ్యాకర్లు సరిగ్గా 'సిస్టమ్ అప్ డేట్' అనే పేరుతో ఓ మాల్వేర్ యాప్ కు రూపకల్పన చేశారని, ఒక్కసారి ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే యూజర్లు తమ ఫోన్లపై నియంత్రణ కోల్పోతారని జింపీరియం అనే సైబర్ భద్రత సంస్థ వెల్లడించింది.

యూజర్లను సులభంగా బుట్టలో వేయడానికి హ్యాకర్లు ఎంతో తెలివిగా దీనికి సిస్టమ్ అప్ డేట్ అని పేరు పెట్టారని, ఇది యూజర్ల డేటాను తస్కరిస్తుందని జింపీరియం వివరించింది. అసలీ మాల్వేర్ ఒక్కసారి ఫోన్ లోకి ఎంటరయితే ఎక్కడ్నించైనా మీ ఫోన్ ను హ్యాకర్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోగలరని పేర్కొంది. దీని పేరు కారణంగా ఆండ్రాయిడ్ సిస్టమ్ అప్ డేట్ అనుకుని యూజర్లు సులభంగా మోసపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ యాప్ ను జింపీరియం సంస్థ రిమోట్ యాక్సెస్ ట్రోజన్ కేటగిరీలో చేర్చింది. ఈ యాప్ ను తయారుచేసేందుకు దాని సృష్టికర్తలు ఎంతో సమయం వెచ్చించి, తీవ్రంగా శ్రమించి ఉంటారని జింపీరియం సీఈఓ శ్రీధర్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత వరకు థర్డ్ పార్టీ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని సూచించారు. ఓఎస్ కు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఫోన్ లోని అప్ డేట్స్ సెక్షన్ లోనే ఉంటాయని, ప్రత్యేకంగా దాని కోసం యాప్ అవసరం లేదని వివరించారు.
System Update
App
Malware
Cyber Experts
Zimperium

More Telugu News