Hop Shoots: హాప్ షూట్స్... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఇదేనట!
- కూరగాయల పంటలో ఇదొక రకం
- పాశ్చాత్య దేశాల్లో అధికంగా పండే పంట
- బీహార్ లో సాగుచేస్తున్న రైతు
- మార్కెట్లో కిలో రూ.85 వేల ధర
- ఆహారంగానే కాకుండా ఔషధాలు, బీర్లలోనూ వాడకం
హాప్ షూట్స్.... ఈ పేరు భారతదేశ ప్రజలకు చాలా కొత్తగా ఉండొచ్చు కానీ, పాశ్చాత్యదేశాల వారికి చిరపరిచితమే. కూరగాయలు, ఆకు కూరల తరహాలో ఇదొక పంట. అయితే అలాంటి ఇలాంటి పంట కాదు... కిలో రూ.85 వేలు పలికే సిరుల పంట. ప్రస్తుతం దీన్ని మనదేశంలోనూ పండిస్తున్నారు. బీహార్ కు చెందిన అమ్రేష్ సింగ్ (38) అనే రైతు తన పొలంలో హాప్ షూట్స్ ను సాగు చేస్తున్నాడు.
ఈ మొక్కలోని పువ్వు భాగాన్ని ఆహారంగా స్వీకరిస్తారు. పైగా, మానసిక రుగ్మతలను తగ్గించే ఔషధాల్లోనూ, బీరు తయారీలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుండడంతో అంత ధర పలుకుతోంది. ఈ పంట సాగు కోసం అమ్రేష్ రూ.2.5 లక్షలు వెచ్చించాడు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తిగా ఆర్గానిక్ పధ్ధతిలో సేద్యం చేస్తున్నాడు. హాప్ షూట్స్ ను శాస్త్రీయంగా హ్యుములస్ లుపులస్ అని పిలుస్తారు.
దీన్ని భారత్ లో తొలిసారిగా వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో సాగు చేశారు. బీహార్ రైతు అమ్రేష్ వీటిని వారణాసి నుంచే తీసుకువచ్చి తన స్వగ్రామం కరాందీలో సాగు చేస్తున్నాడు.