KTR: కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంతో అభివృద్ధి సాధ్యమైంది: కేటీఆర్

KTR reiterates Centre does not give any thing but Telangana growth made possible by stable government

  • ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన
  • ఐటీ హబ్-2, బస్ స్టేషన్ ప్రారంభం
  • విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడంలేదన్న కేటీఆర్
  • కేంద్రం మన వద్ద తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రం మన దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడంలేదని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పింది ఏదీ కేంద్రం అమలు చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, దేశ అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.

ఇవాళ ఖమ్మంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఐటీ హబ్-2 నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వి.ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల అంశంపై చాలామందిలో అస్పష్టత ఏర్పడిందని, కొత్త పెట్టుబడుల సంగతేమో కానీ, ఉన్న పెట్టుబడులైనా నిలుస్తాయా? అని భావించారని వివరించారు. కానీ పాలనా సమర్థత కలిగిన ముఖ్యమంత్రి, సరైన విధానాలు, స్థిరమైన ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉన్న అధికారుల వల్ల తెలంగాణలో ఐటీ రంగం దూసుకుపోయిందని అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.56 వేల కోట్లు కాగా, ఇప్పుడది రూ.1.40 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. కాగా, మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఆధునిక సదుపాయాలతో కూడిన ఖమ్మం బస్ స్టేషన్ ను కూడా ప్రారంభించారు. ఈ బస్ స్టేషన్ ను రూ.25 కోట్లతో నిర్మించారు.

  • Loading...

More Telugu News