Chandrababu: కఠిన నిర్ణయం తీసుకోక తప్పడంలేదు... ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు ప్రకటన

Chandrababu announces party decision to boycott MPTC and ZPTC elections
  • ఏపీలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • రాష్ట్రంలో అరాచకం నెలకొందన్న చంద్రబాబు
  • సీఎం ఏమైనా పోటుగాడా? అంటూ వ్యాఖ్యలు
  • అధికార పక్షాన్ని ప్రజల్లో దోషిగా నిలుపుతామని వెల్లడి 
ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పరిషత్ ఎన్నికలపై తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికల్లో పాల్గొనకపోవడం కఠిన నిర్ణయమే అయినా తప్పడంలేదని అన్నారు. టీడీపీకి ఎన్నికలు కొత్త కాదని, తాము ఎన్నికలంటే భయపడడంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలకు అర్థం కావాలనే తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఏపీలో నిబంధనలను పక్కనబెట్టి మరీ వ్యవహారం నడిపిస్తున్నారని, అధికార పక్షాన్ని ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామని అన్నారు. దీనిపై జాతీయస్థాయిలోనూ పోరాడతామని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నియంతృత్వ పోకడలకు వెళ్లి నాశనం అయిందని, దక్షిణ కొరియా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లి అభివృద్ధి అందుకుందని చెప్పారు. ఇప్పుడిక్కడికి నియంత వచ్చాడని విమర్శించారు.

గతంలో రాగద్వేషాలకు అతీతంగా ఎన్నికలు జరిగేవని, ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. పాత ఎస్ఈసీ పదవిలో ఉండగానే పరిషత్ ఎన్నికలపై మంత్రులు ప్రకటనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల తేదీలు, కౌంటింగ్ వివరాలను ఎలా వెల్లడిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ పార్టీలను అవమానించడం తప్ప మరొకటి కాదని అన్నారు. పరిషత్ ఎన్నికలపై రాజకీయ పక్షాలతో సమావేశం జరపడం ఎందుకని ప్రశ్నించారు. కొత్త ఎస్ఈసీ వచ్చీ రావడంతోనే నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటని నిలదీశారు.

స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా మారాయని తెలిపారు. 2014లో 16,589 ఎంపీటీసీలకు గాను 346 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, అంటే 2 శాతం అని వివరించారు. అయితే ఇప్పుడు 9,696 స్థానాలకు 2,362 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, అంటే 24 శాతం అని పేర్కొన్నారు. సీఎం ఏమైనా పెద్ద పోటుగాడా...? ఆయన నియోజకవర్గంలోనూ అత్యధికంగా ఏకగ్రీవాలు అయ్యాయి... ఇలా ఎలా సాధ్యమైందో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఎక్కడ చూసినా బలవంతపు ఏకగ్రీవాలే అని, పథకాలు అందవని వలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, నామినేషన్లకు సిద్ధపడిన అభ్యర్థులను పోలీసులే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిపే అర్హత ఉందా? లాలూచీ పడడం కాదు, గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు... నిష్పాక్షికంగా ఎన్నికలు జరపాలి అని స్పష్టం చేశారు.  తాజా పరిస్థితులు చూస్తుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని వెల్లడించారు.  గతంలో జ్యోతిబసు, జయలలిత వంటి పెద్దలు కూడా ఎన్నికలను బహిష్కరించారని చంద్రబాబు గుర్తు చేశారు.
Chandrababu
Boycott
MPTC
ZPTC
TDP
Andhra Pradesh

More Telugu News