ANR: ఏఎన్నార్, జయసుధ నటించిన 'ప్రతిబింబాలు'.. ఇన్నాళ్లకు విడుదలవుతున్న వైనం!

ANR film Pratibimbalu to be released in May
  • 1982 సెప్టెంబర్ 4న మొదలైన షూటింగ్
  • మొదట దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు
  • మధ్యలో సింగీతం శ్రీనివాసరావు ఎంట్రీ
  • రకరకాల సమస్యలతో ఆగిపోయిన సినిమా
  • మే నెలలో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటన    
ఒక్కోసారి చిత్ర నిర్మాణంలో ఆలస్యం అవుతుంటుంది. అనుకున్న సమయానికి చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతుంటారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే, ఎంతో కొంత ఆలస్యంతో పూర్తయిన సినిమా అన్నది కాస్త అటు ఇటుగా విడుదలైపోతుంటుంది. కానీ, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఓ చిత్రం మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాలుగా విడుదలకు నోచుకోలేకపోయింది. ఆ సినిమా పేరు 'ప్రతిబింబాలు'!

ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో 1982 సెప్టెంబర్ 4న ఈ చిత్రం షూటింగును ప్రారంభించారు. గతంలో 'వియ్యాలవారి కయ్యలు', 'కోడళ్లొస్తున్నారు జాగ్రత్త', 'కోరుకున్న మొగుడు', 'వినాయక విజయం' వంటి జనరంజకమైన సినిమాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి ఈ చిత్రానికి నిర్మాత.

ఇందులో ఏఎన్నార్, జయసుధ హీరో హీరోయిన్లు కాగా, తులసి, గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, జయమాలిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమా నిర్మాణం మొదటి నుంచీ రకరకాల సమస్యలతో కొనసాగింది. దీంతో సినిమాలోని కొంత భాగానికి మరో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడం జరిగింది.

ఇక గతంలో కొన్ని సార్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ, వేరే కారణాల వల్ల ఎప్పటికప్పుడు బ్రేక్ పడిపోయింది. ఐదారేళ్ల క్రితం కూడా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో, 39 ఏళ్ల తర్వాత ఈ మే నెలలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాధాకృష్ణమూర్తి చెబుతూ, 'ఆనాడు ఈ చిత్రానికి మేం ఎంచుకున్న కథాంశం ఇప్పటికీ ఫ్రెష్ నెస్ తోనే వుంది. అందుకే, ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులకూ నచ్చుతుంది. ఈ సినిమా పట్ల నాకున్న అభిమానంతో ఎప్పటికైనా దీనిని రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉంటూవచ్చాను. ఇప్పటికి అది సాధ్యమైంది. మే నెలలో విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. ఈ చిత్రానికి దివంగత చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చారు.
ANR
Jayasudha
Tulasi
Gummadi

More Telugu News