Maharashtra: పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదు: ఉద్ధవ్ థాకరే హెచ్చరిక
- రెండు రోజుల తర్వాత నిర్ణయం
- కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరిక
- మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం
- శుక్రవారం ఒక్కరోజే 47,827 కేసులు
మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే.. లాక్డౌన్ విధించే అవకాశం లేకపోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వానికి మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలా? లేక ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మహారాష్ట్రలో కరోనా రోజువారీ కొత్త కేసులు భారీ స్థాయిలో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉద్ధవ్ ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘‘నేను ముందే చెప్పాను. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 15 రోజుల్లో మౌలిక వసతులు, వనరులన్నీ పూర్తయిపోతాయి. ఈ నేపథ్యంలో నేను మీకు ఈరోజు లాక్డౌన్ విధింపుపై హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పుడే విధించడం లేదు. మరింత మందితో చర్చిస్తాం. రెండు రోజుల తర్వాత కూడా ఎలాంటి పరిష్కారం లభించకపోతే నాకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు’’ అని థాకరే తెలిపారు. మరో రెండు రోజుల్లో కఠినమైన ఆంక్షలు ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో మహమ్మారి వెలుగుచూసిన తర్వాత శుక్రవారం అత్యధికంగా రాష్ట్రంలో 47,827 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా కరోనాతో 202 మంది ప్రాణాలు కోల్పోయారు.