Prime Minister: కళ్లు తిరిగి పడిపోయిన బీజేపీ కార్యకర్త.. ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన ప్రధాని మోదీ!
- తన వైద్య బృందాన్ని అతడి వద్దకు పంపిన ప్రధాని
- అసోంలోని తమల్పూర్ ప్రచారంలో ఘటన
- ప్రసంగంలో ప్రతిపక్షాలపై విసుర్లు
- అందరికోసం పనిచేస్తే మతతత్వమా అని ప్రశ్న
- ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవాళ్లు లౌకికవాదులా? అని నిలదీత
అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మాట్లాడుతూ మధ్యలో ఒక్కసారిగా ప్రసంగాన్ని ఆపేశారు. నేడు తమూల్పూర్ లో చివరి దశ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఆ సభకు హాజరైన బీజేపీ కార్యకర్త ఒకరు కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రసంగాన్ని ఆపారు. అతడు కళ్లు తిరిగిపడిపోవడాన్ని సభకు వచ్చిన వారు ఎవరూ గమనించలేదు. అది తనకంట పడడంతో, ఆయన అందరినీ అప్రమత్తం చేశారు.
తన వ్యక్తిగత వైద్య సిబ్బందినీ అలర్ట్ చేశారు. వెంటనే ఆ కార్యకర్త వద్దకు వెళ్లి చికిత్స చేయాలని తన వైద్య సిబ్బందికి సూచించారు. తనతో పాటు వచ్చిన వైద్యులు అతడికి చికిత్స చేస్తారని, వారికి సహకరించాలని సభకు వచ్చిన వారిని మోదీ కోరారు. ప్రొటోకాల్ ప్రకారం, ప్రధానితో పాటు నలుగురు వైద్యుల బృందం వస్తుంటుంది. అన్ని రకాల వైద్య పరికరాలనూ, అత్యవసర ఔషధాలను వారు వెంట తీసుకొస్తారు.
కాగా, అందరి కోసం బీజేపీ పనిచేస్తుందని, కానీ, కొన్ని పార్టీలు కొందరి కోసమే పనిచేస్తాయని మోదీ ఈ సభలో ప్రసంగిస్తూ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని వారు విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందరి కోసం పనిచేసే పార్టీనేమో మతతత్వ పార్టీ అని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలను లౌకిక పార్టీలంటూ పిలుస్తున్నారని, అది ఎంత వరకు కరెక్ట్? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం.. అసోం అకార్డ్ (ఒప్పందం)ను పూర్తిగా అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అసోం ప్రజలు ఎన్డీయేకే ఓటేసేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అసోం గుర్తింపును పోగొట్టి, హింసకు పాల్పడే పార్టీలను వారు సహించబోరని తేల్చి చెప్పారు.