Mamata Banerjee: ఓడిపోయే వాళ్లే అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తారు!: మమతపై మోదీ విసుర్లు

Mamata is behaving like a cricketer questioning Umpires Decision says modi

  • బెంగాల్‌లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం
  • నేడు హుగ్లీ సభలో పాల్గొన్న ప్రధాని
  • మమత ఓటమి స్పష్టమైందని వ్యాఖ్య
  • సింగూర్‌ ప్రజలను తృణమూల్‌ మోసం చేసిందని విమర్శ

ఈవీఎంలు, ఎన్నికల సంఘం(ఈసీ) విశ్వసనీయతను ప్రశ్నించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  క్రికెట్‌లో అంపైర్ నిర్ణయాన్ని ఓ ఆటగాడు ప్రశ్నిస్తున్నాడంటే అది అతని ఓటమికి సంకేతమని, ఇప్పుడు దీదీ తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఆమెకు  ఓటమి తప్పదని.. ఈవీఎంలపై ఆమె అనుమానాలే అందుకు సంకేతాలని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు.

అక్రమ పాలన నుంచి తమ మాతృభూమిని కాపాడుకునేందుకు బెంగాల్‌ ప్రజలు ఎప్పుడూ వారి సంపూర్ణ మద్దతు ప్రకటించారని మోదీ అన్నారు. సొంతగడ్డను కాపాడుకోవడంలో వారెప్పుడూ గందరగోళానికి గురికాలేదని వ్యాఖ్యానించారు. తమ ఆశలు, ఆకాంక్షలతో ఆడుకున్న వారిని ఓడించి ప్రజాస్వామ్య పరీక్షలో బెంగాల్ ప్రజలు నెగ్గారని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే పూర్తైన రెండు విడతల ఎన్నికల్లో ప్రజలు సమూల మార్పును కోరుకున్నట్లు స్పష్టమైందన్నారు. మమతా బెనర్జీని ఓడించేందుకు సిద్ధమయ్యారన్నారు.  ఒక్కో విడత పూర్తవుతున్న కొద్దీ దీదీ మరింత ఆగ్రహానికి, గందరగోళానికి గురవుతారని మోదీ విమర్శించారు. ఈ క్రమంలో మాటల దాడికి దిగుతారని చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా సింగూర్‌ టాటా నానో ఫ్యాక్టరీ వివాదాన్ని మోదీ ప్రస్తావించారు. భూసేకరణ వ్యతిరేక చట్టాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆరోపించారు. సింగూర్‌ ప్రజలు ముఖ్యంగా యువత, రైతులు దిక్కులేనివారైపోయారన్నారు. ఒకప్పుడు పారిశ్రామికవాడగా ఉన్న హుగ్లీలో ఇప్పుడు ఒక్క పరిశ్రమ కూడా లేదని తెలిపారు. రైతులు పంట నిల్వ చేసుకోవడానికి ఎలాంటి శీతల గిడ్డంగులు కూడా లేవని విమర్శించారు.

  • Loading...

More Telugu News