Maharashtra: విద్యార్థుల వార్షిక పరీక్షలపై మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
- 1 నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు రద్దు
- విద్యార్థులందరూ పై తరగతులకు ప్రమోట్
- 9వ, 11వ తరగతి విద్యార్థులపై త్వరలో నిర్ణయం
- యథాతథంగా 10వ, 12వ తరగతి పరీక్షలు
- ట్విటర్ ద్వారా వెల్లడించిన విద్యాశాఖ మంత్రి
కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర బోర్డు పరిధిలో చదువుతున్న ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల్ని రద్దు చేసింది. ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండానే వారందరినీ పై తరగతులకు పంపిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
‘‘కొవిడ్-19 వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర బోర్డు పరిధిలోని ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులందరినీ ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాం. తొమ్మిది, 11వ తరగతి విద్యార్థులకు సంబంధించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం’’ అని గైక్వాడ్ పేర్కొన్నారు. మరోవైపు 9వ, 11వ తరగతుల వారికి ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లో బోధన జరిగిన నేపథ్యంలో పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఇక, 10వ, 12 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. అయితే, ఈ పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు అనేక సడలింపులు ఇచ్చారు. సిలబస్‌ను తగ్గించారు. సొంత పాఠశాలల్లోనే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చారు. కరోనా సోకిన విద్యార్థులు జూన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు.
మహారాష్ట్రలో కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ తప్పదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం ప్రజలను హెచ్చరించారు.