Chhattisgarh: యావత్తు దేశం మీకు రుణపడి ఉంది: సోనియా గాంధీ
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు సోనియా నివాళి
- గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- నక్సలిజాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు
- రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ
ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్లో అమరులైన జవాన్లకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు. వారి త్యాగాలకు యావత్తు దేశం రుణపడి ఉందని వ్యాఖ్యానించారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన దాడిలో అమరులైన 22 మంది జవాన్ల త్యాగాలకు ఈ యావత్తు దేశం శిరస్సు వంచి నమస్కరిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. జవాన్ల త్యాగాలకు ఈ దేశం ఎంతో రుణపడి ఉంది. గల్లంతైన సైనికులు సురక్షితంగా తిరిగి రావాలని.. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం ఏరివేతకు సీఆర్పీఎఫ్ తీసుకుంటున్న చర్యలకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సోనియా తెలిపారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.