Kamal Haasan: కమలహాసన్ ప్రచార వాహనంలో రాముడు, సీత వేషధారులు... కేసు నమోదు!
- దేవుళ్ల వేషగాళ్లను చూపిస్తూ కీలక వ్యాఖ్యలు
- పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు
- తమిళనాట ముగిసిన ఎన్నికల ప్రచారం
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగిసింది. ప్రచారానికి చివరి రోజైన ఆదివారం నాడు అన్ని పార్టీల నేతలూ జోరుగా ప్రచారం సాగించారు.
ఇదే సమయంలో తాను ప్రయాణిస్తున్న ప్రచార వాహనంపై శ్రీరాముడు, సీతాదేవి వేషాలతో ఉన్న వారిని నిలబెట్టిన ఎంఎన్ఎం అధ్యక్షుడు కమలహాసన్, కోయంబత్తూరులో ప్రచారాన్ని చేస్తూ, వీరిద్దరూ హిందూ దేవుళ్లేనని, అయితే, వీరిని అడ్డు పెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
కమల్ వైఖరిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కాట్టూరు పోలీసు స్టేషన్ లో ఈ మేరకు కేసు రిజిస్టర్ అయింది. కమల్ పై ఐపీసీలోని మూడు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కాగా, తమిళనాడులో ఎలాగైనా మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని అన్నాడీఎంకే - బీజేపీ, రెండు దఫాలుగా అధికారానికి దూరమై, ఈ సారి ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్న డీఎంకేలు జోరుగా ప్రచారం సాగించాయి.
మరోపక్క, ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారు ప్రచారం చేయగా, డీఎంకే తరఫున అన్నీ తానైన స్టాలిన్ రాష్ట్ర మంతా పర్యటించారు. వీరితో పాటు కమలహాసన్, శరత్ కుమార్, రాధికలతో పాటు సుహాసిని, అక్షర హసన్, టీటీవీ దినకరన్ తదితరులు ప్రజల్లోకి వెళ్లి, తమతమ పార్టీలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.