Bombay: మహారాష్ట్ర హోంమంత్రిపై ఆరోపణల విషయంలో సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశం
- హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ సీపీ
- ఆ ఆరోపణలపై విచారణ జరపాలని జయశ్రీ పాటిల్ వ్యాజ్యం
- విచారణ జరిపిన బాంబే హైకోర్టు
- ఆధారాలు లభ్యమైతే ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో ఆధారాలు లభ్యమైతే ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించింది.
అనిల్ దేశ్ముఖ్ నెలకు రూ.100 కోట్ల వసూళ్లను పోలీసులకు లక్ష్యంగా పెట్టారంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు ముంబై మాజీ సీపీ పరంవీర్ సింగ్ లేఖ రాయడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో మాజీ సీపీ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని న్యాయవాది జయశ్రీ పాటిల్ ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అనిల్ దేశ్ ముఖ్ హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ ఆరోపణలపై రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపిస్తే అది నిష్పాక్షికంగా కొనసాగే అవకాశం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.