Kurasala Kannababu: వివేకా హత్యపై నాడు టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?: మంత్రి కన్నబాబు

AP Minister Kurasala Kannababu questions Pawan Kalyan

  • ఇటీవల తిరుపతిలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
  • వివేకా హత్యకేసు నేపథ్యంలో విమర్శలు
  • పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తిన మంత్రి కన్నబాబు
  • ఈ కేసును సీబీఐకి అప్పగించింది జగనే అని వెల్లడి
  • ఇక రాష్ట్రానికేం సంబంధం ఉండదని స్పష్టీకరణ

ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని... ఇంటెలిజెన్స్ చీఫ్ కు, సీఎం రమేశ్ కు మధ్య సంభాషణలు పవన్ కు తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారని ఆరోపించారు. మరి వివేకా హత్యకేసుపై టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

వివేకా హత్యకేసును సీఎం జగనే సీబీఐకి అప్పగించారని వెల్లడించారు. ప్రస్తుతం వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతోందన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. సీబీఐకి అప్పగించిన తర్వాత ఏ కేసుతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్నది మీ మిత్రపార్టీనే కదా... వారి ఆధ్వర్యంలోనే విచారణ జరుగుతుంటే మమ్మల్నెలా తప్పుబడతారు? అని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ హయాంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

అప్పట్లో పవన్ కల్యాణ్ భారీ డైలాగులు చెప్పారని, ఇప్పుడవన్నీ మర్చిపోయారని విమర్శించారు. తిరుపతి సభలో మోదీ ప్రత్యేకహోదాపై మాటిచ్చిన సంగతి పవన్ కు గుర్తు లేదా? అని కన్నబాబు ప్రశ్నించారు. నాడు పాచిపోయిన లడ్డూలు అంటూ కేంద్రంపై వ్యాఖ్యలు చేసింది ఎవరు? అని నిలదీశారు. విభజన హామీలు గురించి బీజేపీని పవన్ ఎందుకు ప్రశ్నించరు? ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ పై పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? అని మండిపడ్డారు.

రాష్ట్రంలో సీఎం జగన్ కు లభిస్తున్న ప్రజాదరణతో టీడీపీకి భయం పట్టుకుందని, అందుకే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయమైపోయిందని... టీడీపీ, బీజేపీ రెండోస్థానం కోసం పోటీ పడుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News