Maoists: కోబ్రా కమాండో రాకేశ్ సింగ్ మా అధీనంలోనే ఉన్నాడు... వెంటనే 'ఆపరేషన్ ప్రహార్-3'ని నిలిపివేయాలి: కేంద్రానికి మావోల లేఖ
- చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
- 22 మంది భద్రతాబలగాల సిబ్బంది మృతి
- కనిపించకుండా పోయిన కోబ్రా కమాండో
- ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోలు
- మావో అగ్ర కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం వ్యూహం!
చత్తీస్ గఢ్ లోని సుక్మా-బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులు మెరుపుదాడి చేసి భద్రతా బలగాలను దారుణంగా దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 22 మంది భద్రతా బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ కౌంటర్ అనంతరం రాకేశ్ సింగ్ అనే కోబ్రా కమాండో కనిపించకుండా పోయాడు. అతడి కోసం సీఆర్పీఎఫ్ బలగాలు తీవ్రస్థాయిలో గాలిస్తున్నాయి.
అయితే, అతడు తమ అధీనంలోనే ఉన్నాడని తాజాగా మావోయిస్టులు వెల్లడించారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కేంద్రానికి లేఖ రాశారు. 'ఆపరేషన్ ప్రహార్-3'ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
మరోవైపు, మావోలను దెబ్బకుదెబ్బ తీయాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని కలిగిస్తోంది. బీజాపూర్ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మావోల కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మావోల దాడికి సూత్రధారిగా నిలిచిన హిడ్మా లక్ష్యంగా సరికొత్త ఆపరేషన్ చేపట్టేందుకు భద్రతా బలగాలు సన్నద్ధమవుతున్నాయి.