Amit Shah: నక్సల్స్ ముప్పుకు ముగింపు పలకాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది: అమిత్ షా
- చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
- పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ కమాండోల మృతి
- జగదల్ పూర్ లో నివాళులు అర్పించిన అమిత్ షా
- నక్సల్స్ పై పోరును మరింత ముందుకు తీసుకెళతామని ఉద్ఘాటన
చత్తీస్ గఢ్ లో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో సీఆర్పీఎఫ్ బలగాలు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం చవిచూడడంతో కేంద్ర ప్రభుత్వంలో ప్రతీకార జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ ఘటనను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. నక్సల్స్ సృష్టిస్తున్న అశాంతికి చరమగీతం పాడాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
నక్సల్స్ పై పోరులో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని, మరింత తీవ్రంగా పోరాడతామని పేర్కొన్నారు. జవాన్ల ఆత్మత్యాగాలు వృథా కానివ్వబోమని, సీఆర్పీఎఫ్ అధికారుల మనోగతం కూడా ఇదేనని ప్రతీకార చర్యలపై సంకేతాలు అందించారు. ఈ పోరులో అంతిమవిజయం తమదే అవుతుందని వ్యాఖ్యానించారు. చత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ లో జవాన్ల మృతదేహాలకు నివాళులు అర్పించిన అనంతరం అమిత్ షా... పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.