Rana Daggubati: సుకుమార్ శిష్యుడితో రానా మూవీ!
- అభిమానులను నిరాశపరిచిన 'అరణ్య'
- కొత్త ప్రాజెక్టుపై కసరత్తులు
- 1940 నేపథ్యంలో సాగే కథ
కొత్త దర్శకులకు .. కొత్త కాన్సెప్టులకు రానా ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. తన లుక్ మొదలుకుని కథాకథనాల వరకూ అన్ని విషయాల్లోను ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవల చేసిన 'అరణ్య' సినిమాపై ఆయన భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా ఈ సినిమా నిరాశ పరిచింది. కథలో ఎంటర్టైన్మెంట్ .. రొమాన్స్ లోపించడం ప్రధానమైన కారణమనే కామెంట్లు వినిపించాయి. ఇక ఆ తరువాత సినిమాగా ఈ నెల 30వ తేదీన రానున్న 'విరాటపర్వం'పై అభిమానులు దృష్టిపెట్టారు. నక్సలైట్ నాయకుడిగా రానా కనిపించే ఈ సినిమాపై వాళ్లలో ఆసక్తి ఉంది.
ఇక తన బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని రానా కథల ఎంపికలో బిజీగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. తన అనారోగ్య కారణాల వలన, లాక్ డౌన్ కారణంగా రానా ప్రాజెక్టుల మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. అందువలన తరువాత ప్రాజెక్టులను చకచకా లైన్లో పెట్టే పనిలో ఉన్నాడట. అందులో భాగంగానే ఆయన సుకుమార్ శిష్యుడైన వెంకీకి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. 1940ల నాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ వారు నిర్మించనున్నట్టు చెబుతున్నారు. డిఫరెంట్ లుక్ తో రానా కనిపించే ఈ సినిమాను గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.