Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్?
- అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు
- విచారణకు ఆదేశించిన బాంబే హైకోర్టు
- వెంటనే రాజీనామా చేసిన అనిల్
- ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దిలీప్
మహారాష్ట్ర తదుపరి హోంమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ముంబయి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న అనిల్ దేశ్‌ముఖ్ నేడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎక్సైజ్, కార్మిక శాఖల మంత్రిగా ఉన్న దిలీప్ వాల్సే ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన అంబేగావ్ అనే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుల్లో దిలీప్ కూడా ఒకరు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన 1999లో శరద్ పవార్‌తో పాటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఎన్సీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఏర్పాటు సమయంలో దిలీప్ శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు.
అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషర్ పరమ్‌వీర్ సింగ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రాథమిక విచారణ జరపాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో విచారణ జరుగుతున్న సమయంలో పదవిలో ఉండడం సమంజసం కాదని చెబుతూ ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాకరేకు పంపారు.