Chief Justice Of India: ఏపీ నుంచి రెండో సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ.. ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి
- ఈ నెల 24న ప్రమాణ స్వీకారం
- 23న జస్టిస్ బాబ్డే పదవీ విరమణ
- 16 నెలల పాటు సీజేఐగా రమణ
- వచ్చే ఏడాది ఆగస్టు 26న రిటైర్మెంట్
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును జస్టిస్ బాబ్డే సిఫార్సు చేశారు.
ఆ సిఫార్సులకు మంగళవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏప్రిల్ 24న సీజేఐగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి నుంచి 16 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగుతారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా కొనసాగుతారు.
1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన.. ఏపీ నుంచి సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న రెండో వ్యక్తిగా ఘనత సాధించారు. జస్టిస్ రమణ కన్నా ముందు జస్టిస్ కె. సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. దాంతో పాటు 1966–67 నుంచి ఇప్పటిదాకా తొమ్మిదో సీజేఐగానూ జస్టిస్ రమణ నిలవనున్నారు.
మొదట్లో న్యాయవాదిగా, తదనంతర కాలంలో న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునళ్లలో ఎన్నో కీలకమైన కేసులను ఆయన వాదించారు, విచారించారు. రాజ్యాంగ, నేర, సేవలు, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలకు సంబంధించిన కేసుల్లో సిద్ధహస్తుడని చెబుతుంటారు.