Telangana: సెకండ్ వేవ్ స్పీడ్ గా ఉంటే.. టెస్టులు మాత్రం నెమ్మదిగా పెంచుతారా?: తెలంగాణ హైకోర్టు సీరియస్
- ఆర్టీపీసీఆర్ టెస్టులు 10% కూడా లేవన్న ధర్మాసనం
- తెలంగాణ సర్కార్ పై ధర్మాసనం ఆగ్రహం
- బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవని నిలదీత
- కరోనా నిబంధనల అమలుపై తీసుకున్న చర్యలేంటి?
తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టులను తక్కువగా చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను తక్కువగా చేస్తున్నారని, కేవలం యాంటీ జెన్ ర్యాపిడ్ టెస్టులనే ఎక్కువగా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు, చికిత్స, మహమ్మారి కట్టడికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన నివేదికపై మంగళవారం హైకోర్టు విచారించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు 10 శాతం కూడా లేవని పేర్కొంది.
అయితే, ఆర్టీపీసీఆర్ టెస్టులను నెమ్మదిగా పెంచుతున్నామని రాష్ట్ర సర్కార్ తరఫున ఏజీ వివరించగా.. హైకోర్ట్ సీరియస్ అయింది. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తుంటే టెస్టులను నెమ్మదిగా పెంచుతున్నాం అని చెప్పడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ఆదేశించింది.
కరోనా కేసులు పెరుగుతుంటే బార్లు, పబ్బులు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదని హైకోర్టు ప్రశ్నించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో ఎక్కువ మంది జనం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కరోనా పాజిటివ్ రేటు, మరణాల రేటునూ వెల్లడించాలని సర్కారును ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై నమోదైన కేసులు, జరిమానాలకు సంబంధించి రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కాగా, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో కరోనా కట్టడిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో చేస్తున్న కరోనా పరీక్షల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. కరోనా చికిత్స చేస్తున్న ఆసుపత్రులు, కేంద్రాలకు సంబంధించిన వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.