Somesh Kumar: జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

Telangana CS Somesh Kumar video conference with district collectors

  • తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉద్ధృతం
  • జిల్లా కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం
  • కరోనా టెస్టుల సంఖ్య రెట్టింపు చేయాలని సూచన
  • వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆదేశాలు

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై వారితో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. కరోనా టెస్టులు, నిర్ధారణ, చికిత్స, వ్యాక్సినేషన్, కొవిడ్ మార్గదర్శకాలు అమలుపై నిఘా వంటి అంశాలను సోమేశ్ కుమార్ సమీక్షించారు.

కరోనా టెస్టులను రెట్టింపు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం, వారిని ఐసోలేషన్ కు తరలించడం వంటి చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. త్వరగా కరోనా పాజిటివ్ వ్యక్తులను గుర్తించడం వల్ల వీలైనంత ముందే కరోనా చికిత్స ఇచ్చేందుకు వీలవుతుందని వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ అమలును మరింత వేగవంతం చేయాలని సీఎస్ పేర్కొన్నారు. కేంద్రం నియమావళికి లోబడే కరోనా వ్యాక్సినేషన్ కొనసాగించాలని, ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసే కేంద్రాలపై అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కరోనా టీకా డోసులు వేస్తున్నారని, ఆ సంఖ్యను 1.25 లక్షలకు పెంచాలని కలెక్టర్లకు నిర్దేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించేలా, మతపరమైన సమావేశాలను నిరోధించేలా జారీ చేసిన జీవో 68, 69లను కఠినంగా అమలు చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు.

కాగా, ఈ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన కొన్నిగంటల తర్వాత... తనకు కరోనా పాజిటివ్ అని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. కొంత అస్వస్థతకు గురికావడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని తెలిపారు. తనను కలిసినవాళ్లు కూడా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన పలు సమీక్షలకు సోమేశ్ కుమార్ హాజరైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News