Facebook: సొంత వాట్సాప్‌కు పోటీగా వచ్చిన 'సిగ్నల్‌' యాప్‌ వాడుతున్న జుకర్‌బర్గ్‌!

Mark Zuckerberg is using signal app

  • 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల వివరాలు లీక్‌
  • అందులో జుకర్‌బర్గ్‌ సమాచారం ఉన్నట్లు వార్తలు
  • ఫోన్‌నెంబర్‌తో వెతకగా సిగ్నల్‌ వాడుతున్నట్లు తేటతెల్లం!
  • ధ్రువీకరించని జుకర్‌బర్గ్‌, సిగ్నల్‌

ఇటీవల 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిన విషయం తెలిసిందే. వీరిలో దాదాపు 6 కోట్ల మంది భారతీయుల వివరాలు కూడా ఉన్నాయి.

అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఫేస్‌బుక్‌ సహవ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం తన సమాచారాన్ని కాపాడుకోలేకపోయారని తెలుస్తోంది. లీక్‌ అయిన వివరాల్లో జుకర్‌బర్గ్‌ వివరాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఫోన్‌నెంబర్‌, పుట్టిన తేదీ, ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం, వివాహానికి సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయినట్లు సమాచారం.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జుకర్‌బర్గ్‌ ఫోన్‌నెంబర్‌గా చెబుతున్న నెంబర్‌తో సెర్చ్‌ చేయగా.. ఆయన మరో మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఓ సెక్యూరిటీ రీసెర్చర్‌ డేవ్‌ వాకర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వాట్సాప్‌కి పోటీగా సిగ్నల్‌ యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. పైగా వాట్సాప్‌లో వ్యక్తిగత గోప్యతపై ఇటీవల అనేక అనుమానాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సిగ్నల్‌ డౌన్‌లోడ్లు ఊపందుకున్నాయి. దీంతో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు సిగ్నల్‌ని భావిస్తున్నట్లు తేలింది.

అయితే, ఆ ఫోన్‌నెంబర్‌ జుకర్‌బర్గ్‌దే అనిగానీ, ఆయన సిగ్నల్‌లో ఉన్నారనిగానీ ఇప్పటి వరకు ఇటు జుకర్‌బర్గ్‌ లేదా సిగ్నల్‌ యాజమాన్యం ధ్రువీకరించలేదు.

  • Loading...

More Telugu News