Vijayashanti: ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దమ్ముందా?: కేసీఆర్‌ను నిలదీసిన విజయశాంతి
- తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ విజయశాంతి
- ఒకవైపు అరాచకం... మరోవైపు ప్రజల దైన్య స్థితి అని వ్యాఖ్య
- మల్లారెడ్డి ఆడియో రికార్డింగ్‌పై విమర్శలు
- మంత్రిని తొలగించగలరా అని నిలదీత
- డ్రగ్స్ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ప్రస్తావన
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఒకవైపు అరాచకం... మరోవైపు ప్రజల దైన్య స్థితి ఏకకాలంలో కరాళ నత్యం చేస్తున్నాయని విమర్శించారు. పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టిందన్నారు.
ఇక కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షలు చెయ్యాలని కేంద్రం సూచించిందని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో రోజుకు నాలుగైదు వేల టెస్టులు దాటడం లేదన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్ట్‌లు చేసేందుకు వసతులు లేక ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారన్నారు. కరోనా కట్టడికి వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంత్రి మల్లారెడ్డి ఆడియో రికార్డింగ్‌పై మాట్లాడుతూ.. మంత్రులే స్వయంగా భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆడియోలు బయటకొస్తున్నాయన్నారు. ‘ఆ మంత్రిని తొలగించగలరా? ఆ ఎమ్మెల్యేలపై కనీసం పార్టీపరంగానైనా చర్యలు తీసుకోగలరా?’ అని ప్రశ్నించారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఉద్యోగాలు లేక యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలపై వచ్చిన డ్రగ్స్ పార్టీ ఆరోపణలనూ ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. తెలంగాణలో గొప్ప పరిపాలన సాగుతోందంటూ ఊదరగొట్టే సీఎంకి డ్రగ్స్ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు.