India: 48 గంటల్లో 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు!

Active Corona Cases Rise Above One Lakh in Two Days
  • శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • నిన్న 1.15 లక్షలకు పైగా కొత్త కేసులు
  • కన్నుమూసిన 630 మంది
ఇండియాలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 48 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరగడమే ఇందుకు నిదర్శనం. కరోనా మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించిన తరువాత రెండు రోజుల వ్యవధిలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఇదే తొలిసారి. గత సంవత్సరంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన వేళ, మూడు రోజుల వ్యవధిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్ష పెరిగింది.

ఇప్పుడు రెండో వేవ్ ఉద్ధృతంగా సాగుతున్నందున మంగళవారం నాడు ఏకంగా 1,15,249 కొత్త కేసులు వచ్చాయి. ఇదే సమయంలో 630 మంది ప్రాణాలను కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మంగళవారం నాడు 54 వేలకు పైగా పెరిగి, అత్యధిక ఒక రోజు రికార్డును నమోదు చేయగా, ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు వచ్చాయి.

ఆదివారం నాడు రికార్డు స్థాయిలో 1,03,844 కొత్త కేసులు రాగా, రెండు రోజుల తరువాత ఆ రికార్డును దాటుతూ మరిన్ని కేసులు రావడంతో కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి కూడా.

ఇక యాక్టివ్ కేసుల విషయానికి వస్తే, కేవలం 24 రోజుల వ్యవధిలో 2 లక్షల నుంచి 8 లక్షలకు కేసులు పెరిగాయి. చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం 30 శాతం బెడ్లను రిజర్వ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, గత సంవత్సరం డిసెంబర్ తరువాత నిన్న 16 రాష్ట్రాల్లో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India
Corona Virus
Active Cases

More Telugu News