Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు బిగ్ రిలీఫ్... ఆటగాళ్లు, అధికారులకు కరోనా నెగటివ్!
- ప్రస్తుతం చెన్నైలో శిక్షణా శిబిరం
- బీసీసీఐ విధి విధానాల మేరకు పరీక్షలు
- ఎవరికీ కరోనా లేదన్న ఎంఐ ఫ్రాంచైజీ
గడచిన రెండు సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుని, మూడవ సారి కూడా గెలుచుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి బిగ్ రిలీఫ్ లభించింది. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో అందరు ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కు నెగటివ్ ఉన్నట్టుగా తేలింది. 14వ సీజన్ ఐపీఎల్ పోటీలు 9వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలకు ట్రయినింగ్ క్యాంప్ ను కేసులు అధికంగా ఉన్న ముంబైలో కాకుండా, చెన్నైలో నిర్వహిస్తున్నారు.
మంగళవారం నాడు ఆటగాళ్లు, అధికారులకు కరోనా పరీక్షలు చేయించాలని ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించడంతో శిక్షణా శిబిరాన్ని రద్దు చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరిలోనూ కరోనా లేదని, జట్టు మొత్తం నేడో, రేపో ముంబైకి చేరుకుంటుందని జట్టు ప్రతినిధులు తెలిపారు. కరోనా సోకినా లక్షణాలు లేకుండా పలువురు కనిపిస్తున్నందునే అందరికీ పరీక్షలు నిర్వహించామని, బీసీసీఐ విధివిధానాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంఐ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇక తమకు కరోనా సోకలేదని తెలుసుకున్న జస్ ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ తదితర ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు.