Ramana Dikshitulu: జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడంపై బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం
- జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం
- టీటీడీలో అన్య మతస్థులు లేరని అనడం దారుణం
- అన్య మతస్థులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలి
ఇటీవలే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి, వంశపారంపర్య హక్కులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు జగన్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించడం తెలిసిందే. అయితే, దీనిపై ఏపీ బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.
జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరమని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయంగా మాట్లాడాలని రమణ దీక్షితులు భావిస్తే.. ఆయన ప్రధాన అర్చకుడి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. ఆయన చేస్తోన్న వ్యాఖ్యలు టీటీడీ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. టీటీడీలో అన్యమతస్థులు లేరని అనడం దారుణమని అన్నారు. అన్య మతస్థులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.