West Bengal: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు
- 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
- మతప్రాతిపదికన ఓట్లు అడిగినందుకే నోటీసులు
- కేంద్ర మంత్రి ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రచార సభలో మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకుగానూ నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.
దీనిపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని దీదీని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒకవేళ సమాధానం ఇవ్వడంలో విఫలమైతే ఎలాంటి తదుపరి నోటీసు లేకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఫిర్యాదు మేరకే ఈసీ నోటీసులు పంపినట్లు సమాచారం.
ఏప్రిల్ 3న తారకేశ్వర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ‘‘దుష్టశక్తుల మాటలు విని మీ ఓట్లను చీల్చుకోవద్దని నా మైనారిటీ సోదరసోదరీమణులను కోరుతున్నాను. సీపీఎం, బీజేపీకి చెందిన వ్యక్తులు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు డబ్బు పట్టుకొని తిరుగుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే ఈసీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.