Anchal: ఆన్ లైన్ లో వైన్ బాటిల్ కోసం ఆర్డర్ చేస్తే.. క్యూఆర్ కోడ్ పేరిట లక్షలు నొక్కేసిన కేటుగాళ్లు!

Woman was cheated in Bengaluru

  • బెంగళూరులో ఘటన
  • ఆన్ లైన్ లో వైన్ డెలివరీ అంటూ మోసం
  • ఇంటర్నెట్లో దొరికిన ఫోన్ నెంబరుకు కాల్ చేసిన యువతి
  • క్యూఆర్ కోడ్ పంపి పలు దఫాలుగా మోసగించిన వ్యక్తి

బెంగళూరుకు చెందిన ఓ యువతికి ఆన్ లైన్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆంచల్ ఖండేల్వాల్ అనే పాతికేళ్ల యువతి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో నివసిస్తోంది. ఇటీవల ఆమె ఆన్ లైన్ లో వైన్ ఆర్డర్ చేసేందుకు ఇంటర్నెట్లో వెదికింది. ఓ ఫోన్ నెంబరుకు కాల్ చేయగా, అవతల్నించి ఓ వ్యక్తి తనను రణవీర్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. అన్ని రకాల వైన్ సరఫరా చేస్తామని నమ్మకంగా చెప్పాడు. ఆన్ లైన్ లో తాము చెప్పిన అకౌంట్ కు అడ్వాన్స్ చెల్లిస్తే వైన్ బాటిల్ ఇంటికే తెచ్చిస్తామని చెప్పాడు.

అతడు చెప్పిన మాటలను ఆంచల్ గుడ్డిగా నమ్మింది. అతడు పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసింది. కానీ రణవీర్ సింగ్ మాత్రం పేమెంట్ జరిగినట్టు మెసేజ్ రాలేదని చెప్పాడు. ఆ విధంగా పలుమార్లు ఆంచల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించాడు. ఈ క్రమంలో ఆమె ఖాతా నుంచి రూ.1.59 లక్షలు గల్లంతయ్యాయి. అయితే, ఎంతసేపటికీ వైన్ బాటిల్ డెలివరీ ఇవ్వకపోయేసరికి తాను మోసపోయానని గుర్తించింది.

చివరికి వారం రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రణవీర్ సింగ్  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడికి రాహుల్ అనే వ్యక్తి కూడా సహకరించినట్టు అతడిపైనా కేసు నమోదు చేశారు. అయితే నగదు రికవరీకి తాము హామీ ఇవ్వలేమని, ఆమె ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేసివుంటే నిందితుల బ్యాంకు ఖాతాను స్తంభింపజేసేవాళ్లమని పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News