TDP: కృష్ణవరంలో టీడీపీ నాయకురాలి ఇంటిపై వైసీపీ నేతల దాడి.. విధ్వంసం

YCP leaders attack TDP woman leader in East Godavari dist

  • తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలంలో ఘటన
  • పుష్పరత్నం ఇంటిపై వందమందికిపైగా దాడి
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జ్యోతుల నెహ్రూ

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండంలోని కృష్ణవరంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. టీడీపీ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బుదిరెడ్ల పుష్పరత్నం ఇంటిపై వందమందికిపైగా వైసీపీ వర్గీయులు ఇనుపరాడ్లు, కర్రలతో  దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, కిటికీ అద్దాలు, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

పుష్పరత్నం ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ, డీఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విషయం చెప్పారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ.. భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనే వైసీపీ నేతలు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

గోపీనాథ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 150 మంది వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందే ఈ దౌర్జన్యం జరిగిందన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు తప్పితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన గోపీనాథ్ రాజకీయాలు చేయడం సరికాదని, అతడిపై చర్యలు తీసుకోవాలని నెహ్రూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News