Bipin Rawat: సైబర్ సెక్యూరిటీ విభాగంలో చైనాతో పోలిస్తే మనం వెనుకబడే ఉన్నామన్న బిపిన్ రావత్!

China Capable to Held Cyber Attacks on India says Bipin Rawat

  • సైబర్ దాడులు జరిపే శక్తి చైనాకు ఉంది
  • ఫైర్ వాల్స్ ను మరింతగా పెంచుకోవాలి
  • వ్యవస్థ నష్టపోకుండా చూసుకోవాలన్న బిపిన్

ఇండియాపై సైబర్ దాడులు జరిపే శక్తి చైనాకు ఉందని, రెండు దేశాల మధ్య సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలా తేడా ఉందని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జాతి ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారత నేతల్లో ఎంతో శక్తి సామర్థ్యాలున్నాయని చెప్పారు.

అలాగే, దేశంపై జరిగే దాడిని ఎదుర్కోవడంలో భద్రతా దళాలు ముందుంటాయని అన్నారు. ఇదే సమయంలో ఇండియా, చైనాల మధ్య సైబర్ డొమైన్ విభాగంలో అతిపెద్ద తేడాలు ఉన్నాయని, సాంకేతికంగా అభివృద్ధి చెందిన చైనా, మనపై సైబర్ దాడులకు ప్రోత్సహించవచ్చని అన్నారు. ఇప్పటికే చైనా సైబర్ టెక్నాలజీ విభాగంలో భారీ ఎత్తున నిధులను వెచ్చిస్తోందని చెప్పారు.

గత కొన్నేళ్లుగా సాంకేతికత విషయంలో ఇండియా కన్నా చైనా ఎన్నో అడుగులు ముందుకు వేసిందని బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. "ఇండియాపై సైబర్ దాడులకు దిగే శక్తి చైనాకు ఉందని మనకు తెలుసు. అదే జరిగితే, మన వ్యవస్థ చాలా నష్టపోతుంది. మనం కూడా సైబర్ డిఫెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైబర్ దాడులను తట్టుకునే ఫైర్ వాల్స్ ను పెంచుకోవాలి. ఈ విషయంలో నాయకులు సీరియస్ గా ఆలోచించి, ప్రణాళికలను రూపొందించి, ముందడుగు వేయాలి" అని అన్నారు.

ప్రజలకు సేవలందిస్తున్న ప్రతి సాంకేతిక విభాగమూ స్వీయ రక్షణ వ్యవస్థను అత్యుత్తమ స్థాయిలో కలిగివుండాలని, ఎటువంటి సైబర్ దాడినైనా ఎదుర్కోవాల్సి రావచ్చని రావత్ అభిప్రాయపడ్డారు. భారత త్రివిధ దళాల శక్తిపై స్పందించిన ఆయన, సైన్యం, వాయుసేనతో పోలిస్తే నౌకాదళం అత్యంత బలోపేతంగా ఉందని వ్యాఖ్యానించారు. సెక్యూరిటీ సొల్యూషన్స్ విషయంలో పశ్చిమ దేశాలు పాటిస్తున్న విధానాలను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News