Hyderabad: బేగం బజార్ మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం!
- మార్కెట్ లోని 100 మంది వ్యాపారులకు కరోనా
- సాయంత్రం 5 వరకే మార్కెట్ ను తెరవాలని అసోసియేషన్ నిర్ణయం
- కరోనా తగ్గేంత వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడి
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాదులో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మరోవైపు, అనునిత్యం ఎంతో బిజీగా ఉండే బేగం బజార్ పై కరోనా పంజా విసిరింది. మార్కెట్లోని దాదాపు 100 మంది వ్యాపారులకు కరోనా సోకింది.
దీంతో, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ను తెరవాలని నిర్ణయించింది. సాయంత్రం 5 తర్వాత అన్ని షాపులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా ప్రభావం తగ్గేంత వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.