KTR: తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలకు ఫైబర్ గ్రిడ్: కేటీఆర్ ఆదేశాలు
- ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేటీఆర్ సమీక్ష
- ఫైబర్ గ్రిడ్ ను మరింత విస్తరించాలని ఆదేశాలు
- ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ తమ లక్ష్యమని వెల్లడి
- హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేయాలని సూచన
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అన్ని మున్సిపాలిటీలకు తీసుకెళ్లాలని అధికారులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని మరింత విస్తరించాలని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని ఒక నిత్యావసరం అంశంగా పరిగణించి తెలంగాణ పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం చేరుకునే విధంగా ప్రణాళికలు ఉండాలని నిర్దేశించారు.
భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయని వివరించారు.
టీ-హబ్ లో నేడు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది ఆగస్టు కల్లా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఫైబర్ అనుసంధానం జరుగుతుందని అధికారులు మంత్రికి తెలిపారు.