Samar Mirza: చదివింది టెన్త్... వైట్ కాలర్ వేషం వేసి మోసం చేసింది రూ.4.50 కోట్లు!

White collor Fruad in Hyderabad

  • వరంగల్ జిల్లాకు చెందిన సమర్ మీర్జా
  • గచ్చిబౌలిలో ఫేక్ నిర్మాణ రంగ సంస్థ
  • రుణాలిప్పిస్తానంటూ 18 మందిని మోసం చేసిన వైనం

అతను కేవలం పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. అయితేనేం, జీవితాన్ని మాత్రం పూర్తిగా చదివాడు. హైదరాబాద్ లో సంపన్నులు నివాసం ఉండే బంజారాహిల్స్ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని, ఖరీదైన కార్లలో తిరుగుతూ, వందల కోట్లు కావాలన్నా అప్పులు ఇప్పిస్తానని నమ్మ బలుకుతూ ఎంతో మందిని మోసం చేసి, చివరకు పోలీసులకు చిక్కాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, వరంగల్ జిల్లా న్యూరాయ్ పూర్ కు చెందిన మీర్జా ఖాదర్ అలియాస్ సమర్ మీర్జాకు చదువు అబ్బలేదు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. తన తెలివితేటలతో మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్ స్ట్రక్షన్స్ పేరిట ఓ కంపెనీ ఏర్పాటు చేసి, డిసెంబర్ 2020లో గచ్చిబౌలిలోని పీఎస్ఆర్ ప్రైమ్ టవర్స్ భవంతిలో ఓ ఫ్లోర్ నే అద్దెకు తీసుకుని, 30 మందిని ఉద్యోగంలో చేర్చుకున్నాడు. సదరు సంస్థకు తాను డైరెక్టర్ నని ప్రకటించుకుని, ఆన్ లైన్ మాధ్యమంగా వ్యాపార, నిర్మాణ, వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు.

ఈ ప్రకటనలను చూసిన పలువురు అతన్ని ఆశ్రయించగా, వారి నుంచి కోట్లు దండుకున్నాడు. మోహన్ రావు అనే వ్యక్తి, తనకు రూ. 300 కోట్లు కావాలని సంప్రదించగా, ప్రాసెసింగ్ చార్జీల పేరిట రూ. 2.18 కోట్లు లాగాడు. దినేశ్ కుమార్ అనే వ్యక్తి రూ. 10 కోట్లు రావాలని రాగా, రూ. 71 లక్షలు వసూలు చేశాడు. వీఎన్వీ ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రూ. 8 కోట్ల రుణం ఇప్పిస్తానని చెప్పి రూ. 30 లక్షలు తీసుకున్నాడు.

ఇలా 18 మందిని నిలువునా ముంచిన సమర్ మీర్జా, రూ. 4.50 కోట్ల మేరకు వసూలు చేశాడు. ఎంతకీ తమకు రుణం రాకపోవడం, చెల్లించిన డబ్బు కూడా తిరిగి చేతికి రాకపోవడంతో బాధితుల్లో ముగ్గురు పోలీసులను ఆశ్రయించారు. కేసును విచారించిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News