Andhra Pradesh: ఏపీ పరిషత్ ఎన్నికల్లో మూడు చోట్ల మాత్రమే రీపోలింగ్!

Repoling Start in 3 Centers in AP
  • ఏపీలో గురువారం ముగిసిన పరిషత్ ఎన్నికలు
  • అంతా ప్రశాంతమేనన్న ఎస్ఈసీ
  • నేడు ప్రారంభమైన రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో నిన్న ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు అందగా, అందుకు ఎస్ఈసీ నీలం సాహ్నీ అంగీకరించారు. ఈ మూడు కేంద్రాల్లో నేడు రీపోలింగ్ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం, అంటిపేట గ్రామంలో ఓటర్లకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లలో పేర్లు, గుర్తులు తప్పు వచ్చాయి. దీంతో పోటీదారులు అభ్యంతరాలు తెలుపగా, అక్కడ రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక నెల్లూరు జిల్లా, భీమవరంలో బీజేపీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా పని చేసిన వ్యక్తి బ్యాలెట్ బాక్స్ ను తీసుకెళ్లి, నీటి తొట్టెలో పడవేయడంతో, అక్కడ కూడా రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలోనూ ఒక బూత్ లో నేడు రీపోలింగ్ ప్రారంభమైంది. ఈ మూడు కేంద్రాల్లోనూ అదనపు భద్రతను కల్పించామని, కమాండ్ కంట్రోల్ నుంచి ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా, నిన్నటి ఎన్నికల్లో 8 జిల్లాల్లో 60 శాతానికి పైబడే పోలింగ్ జరిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓటేసేందుకు ఓటర్లు ఆసక్తిని చూపించలేదు. ఇక్కడ అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే, ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ప్రకాశం జిల్లాలో 51.68, నెల్లూరు జిల్లాలో 53.52 శాతం ఓటింగ్ నమోదు కాగా, మిగతా జిల్లాల్లో 60 శాతానికి మించిన ఓటింగ్ నమోదైంది. మొత్తానికి కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి.
Andhra Pradesh
ZPTC
MPTC
Elections
SEC

More Telugu News