India: భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య నేడు కీలక చర్చలు
- ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు
- నేడు 11వ విడత కోర్ కమాండర్ల భేటీ
- చర్చలు సఫలమైతే ఇరు దేశాల్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం
గతేడాది మేలో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన తర్వాత మొదలైన సైనిక, దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో చర్చలు జరిగాయి. తాజాగా నేడు సైనిక కమాండర్ల మధ్య తూర్పు లడఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో చర్చలు జరగనున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో కొంతవరకు పురోగతి కనిపించడంతో పాంగాంగ్ సరస్సు, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే, ఘర్షణలకు కేంద్ర బిందువైన మిగతా ప్రాంతాల్లో మాత్రం సైనిక మోహరింపు కొనసాగుతోంది.
తాజా చర్చలు సఫలమైతే గోగ్రాలోయ, హాట్‌స్ప్రింగ్స్, దెమ్ చోక్‌లలో ఉద్రిక్తతలు సడలి ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఇది 11వ విడత కోర్ కమాండర్ల భేటీ అని, నిర్దేశిత ఒప్పందాలకు అనుగుణంగా ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్ తమతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.