Ayyanna Patrudu: అందుకే విలువైన భూములను వైసీపీ ప్రభుత్వం అమ్ముతోంది: అయ్యన్న పాత్రుడు
- జగన్ చేతగాని తనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ
- విశాఖలో 18 స్థలాలను సుమారు రూ.1500 కోట్లకు అమ్మకానికి పెట్టారు
- ఎంపీ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మకాలు
వైసీపీ నేతలపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు పలు ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖలోని విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, తద్వారా ఖజానా నింపుకునే పనిలో పడిందని విమర్శించారు. సీఎం జగన్ కు పరిపాలన చేతకాకపోవడం వల్లే ఖజానా ఖాళీ అయి ఇలా భూములను అమ్మే పరిస్థితికి వచ్చిందని అన్నారు. 18 స్థలాలను సుమారు రూ.1500 కోట్లకు అమ్మబోతున్నట్లు తెలిపారు.
దీనిపై ఇప్పటి వరకు రాజకీయ నాయకులతో పాటు మేధావులు, అధికారులు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలోని విలువైన భూములను ప్రభుత్వం అమ్ముతోందని చెప్పారు. అంతేగాక, సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్, ప్రేమ సమాజం భూములను కూడా అమ్మకానికి పెట్టారని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోపక్క, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా అమ్మేస్తున్నప్పటికీ దానిపై ఏమీ చేయలేని పరిస్థితి దాపురించిందని చెప్పారు.