Perni Nani: వకీల్ సాబ్ సినిమాకు, ఎన్నికలకు ఏంటి సంబంధం?: మంత్రి పేర్ని నాని
- పవన్ నటించిన వకీల్ సాబ్ విడుదల
- ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు
- బీజేపీ ఆగ్రహం
- 4 షోలకే అనుమతి ఉందన్న పేర్ని నాని
- పవన్ కోసం నిబంధనలు మార్చబోమని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు రిలీజ్ కాగా, ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
వకీల్ సాబ్ చిత్రానికి, ఎన్నికలకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 4 షోలకే అనుమతి ఉందని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా? అని వ్యాఖ్యానించారు. పవన్ సినిమా అయినంతమాత్రాన నిబంధనలు మార్చరన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీ, పవన్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఏపీకి ఏం చేశారని బీజేపీకి ఓటువేయాలి? ఏపీ ప్రజలను మోసం చేసినందుకే ఓటు వేయాలా? విభజన హామీలు అమలు చేయనందుకు ఓటు వేయాలా? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయాలా?" అని మండిపడ్డారు.
"నాడు రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది బీజేపీయేనని పవన్ అనలేదా? బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని పవన్ వ్యాఖ్యానించలేదా?" అని పేర్ని నాని నిలదీశారు. చేయి చాచి సాయం అడిగితే ఉమ్మేశారని పవనే ఆరోపించారని గుర్తుచేశారు.