Jagan: రేణిగుంటలో సీఎం జగన్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన వైసీపీ మంత్రులు
- తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
- వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తి
- ఈ నెల 14న సీఎం జగన్ తిరుపతి రాక
- రేణిగుంట వద్ద బహిరంగ సభ
ఈ నెల 14న ఏపీ సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. రేణిగుంటలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక బరిలో వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా సీఎం జగన్ సభ కోసం రేణిగుంటలో ఎంపిక చేసిన స్థలాన్ని వైసీపీ మంత్రులు పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, టీటీడీ చైర్మన్, చిత్తూరు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి తదితరులు సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రౌడీ రాజ్యం నడుపుతున్నాడని చంద్రబాబు ఆరోపిస్తున్నాడని, అదే నిజమైతే జగన్ కు ప్రజలు ఇంతలా బ్రహ్మరథం పట్టేవారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నాడు కాబట్టే స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పక్షాన నిలిచారని వెల్లడించారు. తిరుపతిలోనూ వైసీపీకి ఘనవిజయం ఖాయమని అన్నారు.