Deaths: భారత్ లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 180 మరణాలు: ఏఈఎఫ్ఐ కమిటీ నివేదిక
- మూడ్రోజుల వ్యవధిలోనే అత్యధిక మరణాలు
- యూరప్ లోనూ ఇదే తీరు
- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై సందేహాలు!
- రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలంటున్న ఈఎంఏ
దేశంలో జోరుగా కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ చాలామంది భయపడి డోసులు తీసుకోవడంలేదు. పలు చోట్ల కరోనా వ్యాక్సిన్ తీసుకుని చనిపోయారన్న ప్రచారం అనేకమందిని వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంచుతోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం ఏర్పాటు చేసిన ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ రూపొందించిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
మార్చి 31 వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 180 మంది మృతి చెందినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది. అందులోనూ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే నాలుగింట మూడొంతుల మంది చనిపోయారని వివరించింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ, బ్రిటన్ లోనూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభవించిన మరణాలకు, భారత్ లో చోటుచేసుకున్న మరణాలకు సారూప్యత ఉందని ఏఈఎఫ్ఐ కమిటీ పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైద్య సిబ్బంది గానీ, సామాన్య ప్రజలు కానీ రెండు వారాల వరకు అప్రమత్తంగా ఉండాలని, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉందని, ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోయే అవకాశం ఉందని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ (ఈఎంఏ) హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఈఎఫ్ఐ కమిటీ రూపొందించిన నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది.
యూరప్ దేశాల్లో వ్యాక్సిన్ అనంతరం మరణాలకు ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కారణం కావొచ్చని యూరోపియన్ యూనియన్ తో పాటు యూకే ఔషధ నియంత్రణ వ్యవస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే భారత్ లో మరణాలకు ఏ వ్యాక్సిన్ కారణమన్నది ఏఈఎఫ్ఐ కమిటీ స్పష్టంగా పేర్కొనలేదు.