New Delhi: దేశ రాజధానిలో కరోనా తీవ్రం... విద్యాసంస్థల మూసివేత
- ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7 వేలకు పైగా కేసులు
- కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్
- కాలేజీలు, పాఠశాలలు మూసివేయాలని ఆదేశం
- ఢిల్లీ ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాప్తి
ఢిల్లీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే 7,437కి పైగా పాజిటివ్ కేసులు వెల్లడైన నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. తదుపరి ప్రకటన చేసేవరకు పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో దేశ రాజధానిలో ఏప్రిల్ 6 నుంచి 30వ తేదీ వరకు రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారు.
అటు ఎయిమ్స్, సర్ గంగారామ్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఎయిమ్స్ లో వారం వ్యవధిలోనే 32 మంది వైద్య సిబ్బంది కరోనా బాధితుల జాబితాలో చేరారు. గంగారామ్ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.