Johnson & Johnson: భారత్‌లో ‘జాన్సెన్’ ఏక డోసు టీకా క్లినికల్ ప్రయోగాలకు ప్రయత్నాలు షురూ!
- జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన ఒకే డోసు టీకా
- అమెరికా, ఐరోపా సమాఖ్యలో వినియోగానికి అనుమతి
- భారత్‌లో ప్రయోగాలకు ప్రభుత్వంతో చర్చలు
- రెండో దఫా విజృంభణ నేపథ్యంలో ప్రాధాన్యం
కరోనా నివారణకు అమెరికా ఔషధ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ రూపొందించిన టీకా ‘జాన్సెన్’. ఇది ఒకే డోసు వ్యాక్సిన్. అమెరికా, ఐరోపా సమాఖ్య, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి.
అయితే, తాజాగా భారత్‌లోనూ ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక్కడి నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా ప్రయోగాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరికీ కరోనా టీకాను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొంది.
ఏ టీకా అయినా భారత్‌లో ఆమోదం పొందాలంటే ఇక్కడ రెండు, మూడో దశ క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సిందే. ఈ నేపథ్యంలోనే జాన్సన్ అండ్ జాన్సన్ చర్చలు జరుపుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దఫా విజృంభిస్తుండడం.. టీకా కొరత చర్చనీయాంశంగా మారిన తరుణంలో జాన్సెన్ అనుమతి కోరడం గమనార్హం.