Sharmila: సీఎం కేసీఆర్ ను నిలదీయాలంటే మన పార్టీ ఉండాలి: షర్మిల
- ఖమ్మంలో షర్మిల ప్రసంగం
- సీఎం కేసీఆర్ పై విమర్శలు
- వైఎస్ ఘనతల ప్రస్తావన
- ఇద్దరికీ ఎన్నో తేడాలున్నాయని వివరణ
- అస్సలు పోలికేలేదని స్పష్టీకరణ
ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగంలో సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. ఓవైపు గతంలో తన తండ్రి వైఎస్సార్ పాలన ఘనతలు చెబుతూ, ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితి దిగజారిందని పేర్కొంటూ షర్మిల ప్రసంగం కొనసాగించారు. కేసీఆర్ పాలనలో అన్యాయాలను ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం ఉందంటూ ఉద్ఘాటించారు. తెలంగాణలో తాము ఎందుకు పార్టీ పెడుతున్నారో షర్మిల సోదాహరణంగా వివరించారు.
"నాడు వైఎస్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అది రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు. కానీ కేసీఆర్ ఇప్పుడదే ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీడిజైనింగ్ పేరుతో రూ.1.30 లక్షల కోట్లకు అంచనాలను పెంచేశాడు. ఇది అవినీతి కాదా? ఇందులో ఎవరి వాటా ఎంత? అనేది నిలదీయడానికే మన పార్టీ అవసరం. రైతులకు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. కానీ ఇవాళ కౌలు రైతు రైతే కాదంటున్నారు. రైతు పేరు మీద పాలకులు జేబులు నింపుకుంటున్నారు. ఇలాంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం.
నాడు వైఎస్ పావలా వడ్డీకే మహిళలకు రుణాలు ఇప్పిస్తే నేడు సున్నా వడ్డీ అని కేసీఆర్ అంటున్నారు. కానీ బ్యాంకులు 12.5 శాతం వడ్డీ వేస్తున్నారని అక్కచెల్లెళ్లు నాతో చెప్పారు. దీన్ని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు సీఎం కేసీఆర్ గారు... ఈ వాగ్దానం ఏమైందో తెలియడంలేదు. దీన్ని గట్టిగా నిలదీయాలంటే మన పార్టీ అవసరం" అని వివరించారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్సార్ పాలన సాగిందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందరికీ అందించాడన్నారు. కానీ ఇప్పుడున్న నాయకుల్లో ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా? అని షర్మిల ప్రశ్నించారు.