Rahul Dravid: భవిష్యత్తులో సింగిల్స్ తీయబోరేమో: క్రికెట్ పై రాహుల్ ద్రావిడ్
- సింగిల్స్ ను తిరస్కరించే రోజులు దగ్గర్లోనే
- బౌండరీలదే రాజ్యం కాబోతోంది
- ఎంఐటీ సదస్సులో అభిప్రాయపడ్డ రాహుల్ ద్రావిడ్
భవిష్యత్తులో క్రికెటర్లు సింగిల్స్ కోసం ప్రయత్నించబోరేమోనని, బౌండరీలదే పెత్తనం అవుతుందని, ఈ రోజులు త్వరలోనే మనం చూస్తామని భారత క్రికెట్ జట్టులో 'ది వాల్'గా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం యువ క్రికెటర్లకు శిక్షణ ఇస్తున్న రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.
క్రికెటర్లు సింగిల్స్ ను తిరస్కరించే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. క్రికెట్ లో విప్లవాత్మక మార్పులకు సమాచారం, విశ్లేషణ ఎలా కారణమవుతున్నాయన్న విషయమై ఎంఐటీ (మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిర్వహించిన వర్చ్యువల్ సదస్సులో రాహుల్ ద్రావిడ్ పాల్గొన్నారు. ఇదే సదస్సుకు గ్యారీ కిర్ స్టెన్, ఇషా గుహ తదితరులు కూడా పాల్గొనగా, వివిధ అంశాలపై రాహుల్ వారితో చర్చించారు.
ఫ్యూచర్ లో ఫోర్లు, సిక్సులు కొట్టేందుకే ఆటగాళ్లు ప్రయత్నిస్తారని అంచనా వేసిన రాహుల్, బేస్ బాల్ ను, క్రికెట్ నూ పోల్చారు. ఈ రెండు గేమ్ లకూ గణాంకాలే ఆధారమని, ఇదే సమయంలో గత దశాబ్దంన్నర కాలంలో ఆటగాళ్ల సగటును పరిశీలిస్తే, అది రోజురోజుకూ పెరుగుతోందని గుర్తు చేశారు. ఇప్పటికే ప్రతి రెండు లేదా మూడు బంతులకు ఒక ఫోర్ లేదా సిక్స్ కొట్టే రోజులు వచ్చేశాయని అన్నారు. ఇదే సమయంలో క్రికెట్ ఆటలో బ్యాట్ కు, బంతికీ మధ్య సరైన పోటీ ఉండేలా చూసుకోవాలని సూచించారు.