Hyderabad: కరోనాను సీరియస్ గా తీసుకోరా? కఠిన చర్యలు తప్పవు: హైదరాబాదీలకు పోలీసుల హెచ్చరిక!
- నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రజలు
- పెరుగుతున్న కేసులను లెక్క చేయడం లేదు
- కేసులు నమోదు చేస్తామన్న సీపీ అంజనీకుమార్
కరోనా సెకండ్ వేవ్ ను హైదరాబాద్ వాసులు సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రజలు ఇలాగే ఉంటే, కఠిన చర్యలు తీసుకోక తప్పదని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. నిత్యమూ కేసులు పెరిగిపోతుంటే, ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోక తప్పేలా లేదని ఆయన అన్నారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుమారు కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులను ఎవరూ లెక్క చేయడం లేదని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి పట్ల నిరంతరం అప్రమత్తత అవసరమని, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ఎంతమాత్రమూ పాటించడం లేదని, స్వీయ రక్షణ, తమ కుటుంబీకుల రక్షణ గురించి ప్రజలు మరిచారని అన్నారు.
మాస్క్ లు లేకుండా వీధుల్లో తిరిగితే కేసులు నమోదు చేయక తప్పదని హెచ్చరించారు. రానున్న పండగల సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు.