BJP: బీజేపీ మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తాను బలిగొన్న కరోనా
- గత నెల 31 కరోనా బారిన శ్యామాచరణ్ గుప్తా
- ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్న భార్య
దేశంలో రెండోసారి కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి ఈసారి రికార్డు స్థాయిలో ప్రాణాలు బలిగొంటోంది. తాజాగా, దీని బారినపడిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ మాజీ ఎంపీ శ్యామాచరణ్ గుప్తా గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.
గత నెల 31న కొవిడ్ బారినపడిన ఆయనను ప్రయాగ్‌రాజ్ నుంచి దేశ రాజధానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శ్యామ్ గ్రూప్ జనరల్ మేనేజర్ మనోజ్ అగర్వాల్ ఆయన మృతిని ధ్రువీకరించారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారు.
11 రోజుల క్రితం శ్యామా చరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న స్వరూప్ రాణి ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడక పోవడంతో ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, కరోనా బారినపడిన ఆయన భార్య ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.