Chittoor District: చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రం... 719 కొత్త కేసులు, నలుగురి మృతి
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 31,719 కరోనా పరీక్షలు
- 3,495 మందికి పాజిటివ్
- 9 మంది మృతి
- 1,198 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదు. ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య ఉద్ధృతస్థాయిలో నమోదువుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 719 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రం మొత్తం మీద 9 మంది మరణించారు. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,300కి పెరిగింది.
ఇతర జిల్లాల విషయానికొస్తే గుంటూరు జిల్లాలో 501, విశాఖ జిల్లాలో 405, కృష్ణా జిల్లాలో 306 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 9,25,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,97,147 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 20,954 మంది చికిత్స పొందుతున్నారు.